శివన్నగూడెం భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- రాంరెడ్డిపల్లి సర్పంచ్ లపంగి నర్సింహా
- ఇంటికో ఉద్యోగం, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి..
- ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్
నల్గొండ ,మర్రిగూడ,:డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలంలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్ పరిధిలో భూములు, ఇళ్లు కోల్పోయిన రాంరెడ్డిపల్లి గ్రామ భూ నిర్వాసితులను ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన భూ నిర్వాసితుల సమస్యలపై ఆయన సోమవారం నాడు అధికారులను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహా మాట్లాడుతూ.. దేశానికి, ప్రాంతీయ ప్రగతికి ప్రాజెక్టులు అవసరమే అయినప్పటికీ, వాటి కోసం రక్తం కూడు చేసుకుని సంపాదించుకున్న భూముల ను వదులుకున్న పేద రైతులను, కూలీలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. రాంరెడ్డిపల్లి గ్రామస్తులు తమ జీవనాధారమైన భూములను కోల్పోయి నేడు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాంరెడ్డిపల్లి భూ నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించాలి
భూములు కోల్పోయిన రాంరెడ్డిపల్లి భూ నిర్వాసితులందరికీ ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన పునరావాస కాలనీని ఏర్పాటు చేసి, ఉచితంగా ఇండ్ల ప్లాట్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చర్లగూడెం ముంపు గ్రామస్తులకు ఇంకా అందాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని, ప్లాట్లను తక్షణమే పంపిణీ చేయాలన్నారు.
ఇంటికో ఉద్యోగం.. స్థానికులకే ప్రాధాన్యత
సర్వస్వం కోల్పోయిన బాధితుల కుటుంబాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు గానూ.. అర్హతను బట్టి ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు. శివన్నగూడెం ప్రాజెక్టు నిర్వహణ, ఇతర పనుల్లో వచ్చే ఉద్యోగాలను మరియు కాంట్రాక్ట్ ఉపాధి అవకాశాలను స్థానిక బాధితులకే మొదటి ప్రాధాన్యతగా కేటాయించాలన్నారు.
మత్స్య సంపదపై స్థానికులకే హక్కులు ఇవ్వాలి
రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో లభించే మత్స్య సంపదపై, చేపలు పట్టుకునే హక్కులను స్థానిక భూ నిర్వాసితులకే కల్పించాలని సర్పంచ్ కోరారు. తద్వారా వారు ప్రత్యామ్నాయ ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం భూమినే నమ్ముకుని జీవిస్తున్న పేద, మధ్యతరగతి రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి అండగా నిలవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన రాంరెడ్డిపల్లి ప్రజల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి, వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లపంగి నర్సింహా డిమాండ్ చేశారు.

Views: 489
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
