కాళేశ్వరం నీళ్లున్నా సాగుకు నీరేది.. పంటలకు కరెంటేది?
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి కాంగ్రెస్ ప్రభుత్వంపై చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆగ్రహం
వేములవాడ: రైతులకు సాగునీరు అందించడంలో, పంటలను కాపాడేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు విమర్శించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ వేములవాడ-చెక్కపల్లి రహదారిలోని సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, రుద్రంగి, కోనరావుపేట తదితర మండలాల్లో విద్యుత్ కోతలతో రైతులు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు విధిస్తే తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావం తెలిసినా ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.కాళేశ్వరం జలాలను సమర్థంగా వినియోగించుకుని సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలు, సరఫరాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.సొంత ఊరిలో రైతుల పంటలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎందుకు స్పందించడం లేదని చల్మెడ ప్రశ్నించారు. రైతులకు బోనస్ ప్రకటించడం కంటే ముందుగా పంటలు చేతికొచ్చేలా సాగునీరు, విద్యుత్ అందించాలని సూచించారు.రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి, కోతలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చల్మెడ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


