ఎంపీ వంశీకృష్ణ లేఖపై మండిపడ్డ మల్హర్ రావు మండల కాంగ్రెస్ నాయకులు
స్వామీజీ పర్యటనను రాజకీయ కోణంలో చూడటం సిగ్గుచేటు - యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి
మల్హర్ : గణపతి సచ్చిదానంద స్వామీజీ మంథని పర్యటనపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాసిన లేఖను మల్హర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, చిన్నతుండ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాంతి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గడ్డం క్రాంతి మాట్లాడుతూ.. గణపతి సచ్చిదానంద స్వామీజీ వంటి ఆధ్యాత్మిక గురువులు మన ప్రాంతానికి రావడం గర్వకారణమని అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వామీజీని మంథనికి ఆహ్వానించారని, స్వామీజీ తన సందేశం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన, సోదరభావం, శాంతి, సంతోషం పెంపొందించేలా సందేశం ఇచ్చారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం, వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు.స్వామీజీ కార్యక్రమానికి మూడు కోట్లు ఖర్చు చేశారంటూ ఎంపీ వ్యాఖ్యానించడాన్ని ప్రశ్నిస్తూ.. ఖర్చుల వివరాలు తెలియకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తన సొంత నిధులతో ఖర్చు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించడంతో పాటు కేరళలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకుడని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడిన నాయకుడిపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఎంపీగా గెలిపించిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మంథని పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎంపీపై ఉందని పేర్కొన్నారు.అలాగే స్థానికంగా కొందరిని మాత్రమే పరామర్శించి, మిగతా బాధిత కుటుంబాలను పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. ఎంపీ వంశీకృష్ణ వ్యవహారశైలిపై పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆధారాలు, ఫొటోలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు.మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముందుకు వెళితే సహించేది లేదని, తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మల్హర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బండి స్వామి, మేకల రాజయ్య, బొమ్మ రజిత, రమేష్ రెడ్డి, జ్యోష్ణ, శరణ్ రావు, అబ్బినేని లింగస్వామి, చంద్రగిరి సంపత్, మండల యూత్ జనరల్ సెక్రటరీ రాహుల్, దుద్దిళ్ల సత్యం, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


