9న ఆదిలాబాద్‌కు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాక – ఐటీ టవర్ ప్రారంభోత్సవం

కేటీఆర్ సొంత చెల్లి చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలా? – డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్

9న ఆదిలాబాద్‌కు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాక – ఐటీ టవర్ ప్రారంభోత్సవం

 ఆదిలాబాద్ బ్యూరో : ఈనెల 9 న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విచ్చేయనున్నారని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌నుప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
 ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేష్ జాదవ్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాను ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. ఐటీ టవర్ ప్రారంభంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలకు కొత్త మార్గాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తోందని పేర్కొన్నారు.
అలాగే దీపావళి పండుగ సందర్భంగా నూతనంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న పేద కుటుంబాలన్నీ తమ ఇళ్లలో సంతోషంగా ఇందిరమ్మ సంబరాలు జరుపుకోవాలని డా. నరేష్ జాదవ్ ఆకాంక్షించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా తన సొంత  సోదరి ఇంద్రవెల్లిలో చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని  నరేష్ జాదవ్ డిమాండ్ చేశారు.
చనాకా–కోరాట బ్యారేజ్ నిర్మాణాన్ని రూ.350 కోట్ల అంచనాతో ప్రారంభించి, చివరకు రూ.1,800 కోట్లకు పెంచిన వ్యవహారంలో అవినీతి జరిగిందని, జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై కేటీఆర్ సోదరి చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కేటీఆర్ ముందు మీ ఇంట్లో తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ పాలనలో జరిగిన తప్పిదాలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగా కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకు తిన్నారని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి బ్యారేజీల నాణ్యత వరకు అనేక అంశాలపై ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులపై ఉందని అన్నారు. ప్రజాధనాన్ని ఖర్చు చేసిన ప్రాజెక్టుల విషయంలో బాధ్యత వహించకుండా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఎల్‌నినో ప్రభావాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలోనే కరువు ఏర్పడినట్లు కేటీఆర్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని  నరేష్ జాదవ్ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని హితవు పలికారు.రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో కరువు ప్రభావం ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని డా. నరేష్ జాదవ్ తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.రూ.500కే గ్యాస్ సిలిండర్.
అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ.
ఇలా రాష్ట్రంలోని ప్రతి అర్హమైన కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని ఆయన వివరించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం పేదలు కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించిందని గుర్తు చేశారు. త్వరలోనే అర్హులైన ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నూతన పింఛన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అధికారం కోల్పోయిన అసహనంతోనే కేటీఆర్ విమర్శలు
పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు, నేడు అధికారం కోల్పోయిన అసహనంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని డా. నరేష్ జాదవ్ ఎద్దేవా చేశారు.
ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
కేటీఆర్ విమర్శలు చేయడం మానుకుని, గత పదేళ్లలో మీ ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టుల ఖర్చులు, రైతులకు అందని సాగునీరు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం వల్ల ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేరు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఐటీ టవర్ ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని, రానున్న రోజుల్లో జిల్లాలో మరిన్ని పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డా. నరేష్ జాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజే టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డిసిసి సాజిద్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మంగేష్ కుమార్, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బండి దేవదాస్ చారి, అత్తర్ అలీ, మల్యాల కరుణాకర్, జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్ , జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ గుడిపల్లి నగేష్ ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, శివాజీ కాంప్లె , అప్సర్ ఖాన్, జాదవ్ రాధేశం , రసూల్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News