ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెన్షనా? నోటీసు ఇవ్వకుండానే పార్టీ నుంచి తొలగిస్తారా?

షోకాజ్ నోటీసు లేదు.. ఫిర్యాదు కాపీ లేదు.. కనీసం వివరణ కూడా తీసుకోలేదు - 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఇదేనా గుర్తింపు - సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: కొయ్యూరు ఉపసర్పంచ్ లాకావత్ సవేందర్

ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెన్షనా? నోటీసు ఇవ్వకుండానే పార్టీ నుంచి తొలగిస్తారా?

మల్హర్ : కాంగ్రెస్ పార్టీ కోసం గత 20 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన తమను, నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తీవ్ర అన్యాయమని కొయ్యూరు గ్రామ ఉపసర్పంచ్ లాకావత్ సవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా సస్పెన్షన్ విధించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.
గత అక్టోబర్ 26న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్‌గా తాను, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు లాకావత్ లక్ష్మి హాజరయ్యామని సవేందర్ తెలిపారు. అయితే ఎంపీ కార్యక్రమానికి హాజరైన కారణంగానే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు.ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ గ్రామానికి వచ్చి నిరుపేద విద్యార్థులకు సహాయం చేస్తుంటే, స్థానిక ప్రజాప్రతినిధులుగా ఆ కార్యక్రమానికి హాజరుకావడం తప్పా? ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే కదా? అని సవేందర్ ప్రశ్నించారు.సస్పెన్షన్ విధించిన మరుసటి రోజే దీనిపై వివరణ కోరినప్పటికీ ఇప్పటివరకు తమకు ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అందలేదని, తమపై ఎవరు ఫిర్యాదు చేశారో కూడా తెలియజేయలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీ ఇవ్వకుండా, షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, కనీసం తమ వాదన వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు.ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు తగిన సమయం కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కనీసం వారం రోజుల గడువు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ విధించడం కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని గుర్తుచేశారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, రెండు దశాబ్దాలుగా జెండా మోసిన కార్యకర్తలకు చివరికి దక్కిన గుర్తింపు ఇదేనా? అని ప్రశ్నించారు.పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి. ఎలాంటి వివరణ తీసుకోకుండా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ వ్యవహారంపై టీపీసీసీ పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కొయ్యూరు ఉపసర్పంచ్ లాకావత్ సవేందర్ డిమాండ్ చేశారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News