న్యూయార్క్ బేగెల్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ బ్రాండ్‌కు స్వర్ణం అంతర్జాతీయ విభాగంలో ‘బేగెల్ బ్రిగేడ్’కు ప్రథమ స్థానం
బటర్ చికెన్, చికెన్ టిక్కా రుచులతో అంతర్జాతీయ గుర్తింపు 2024లో హైదరాబాద్‌లో ప్రారంభమైన స్టార్టప్‌కు అరుదైన గౌరవం సహ వ్యవస్థాపకులు శరత్ చంద్రారెడ్డి గట్టు, డాక్టర్ నవ్య చంబలోన్ హర్షం
హైదరాబాద్, : హైదరాబాద్‌లో ప్రారంభమైన బేగెల్, కాఫీ స్టార్టప్ ‘బేగెల్ బ్రిగేడ్’ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అమెరికాలోని న్యూయార్క్‌లో నవంబర్ 15న సిటీ ఫీల్డ్‌లో నిర్వహించిన న్యూయార్క్ బేగెల్ ఫెస్ట్–2026లో బెస్ట్ ఇంటర్నేషనల్ విభాగంలో గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖ బేగెల్ బ్రాండ్లను అధిగమించి ఈ ఘనత సాధించింది.
2024లో హైదరాబాద్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సంస్థకు ఈ విజయం ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ పోటీలో ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన బోడేగా బేగెల్స్ రజతం, స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన సిసి బేగెల్స్ కాంస్య పతకాన్ని సాధించాయి. ఈ ఏడాది పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన దరఖాస్తుల్లో 9 శాతం కంటే తక్కువ మందికే అవకాశం లభించగా, అందులో బేగెల్ బ్రిగేడ్ విజేతగా నిలవడం విశేషం.
సంప్రదాయ బేగెల్స్‌కు భారతీయ రుచులను జోడించడం ఈ సంస్థ విజయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బటర్ చికెన్, చికెన్ టిక్కా బేగెల్ శాండ్‌విచ్‌లతోపాటు సోర్‌డో బేగెల్స్, తందూరీ, పుదీనా చట్నీ రుచులతో రూపొందించిన స్ప్రెడ్స్ (ష్మియర్స్)ను పోటీల్లో ప్రదర్శించింది. భారతీయ వంటకాల ప్రత్యేకతను అంతర్జాతీయ ఆహార శైలితో మేళవించి న్యాయనిర్ణేతలు, సందర్శకులను ఆకట్టుకుంది.
సంస్థ సహ వ్యవస్థాపకులు శరత్ చంద్రారెడ్డి గట్టు, డాక్టర్ నవ్య చంబలోన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న ఆలోచన అంతర్జాతీయ వేదికపై విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. మంచి కాఫీకి నాణ్యమైన ఆహారం తోడైతే వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతి లభిస్తుందనే ఆలోచనతో సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. న్యూయార్క్‌కు వెళ్లే ముందు కేవలం పాల్గొనడానికి కాకుండా, విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని చెప్పామని, ఇప్పుడు స్వర్ణం గెలవడం ఆ నమ్మకాన్ని నిజం చేసిందన్నారు.
బేగెల్ బ్రిగేడ్ రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, కాఫీ విరామాలకు అనువైన తాజా ఆహార పదార్థాలు, పానీయాలను అందిస్తోంది. సంస్థ ప్రత్యేకతల్లో ఇంట్లోనే తయారు చేసే కల్చర్డ్ క్రీమ్ చీజ్ ఒకటి. పాలు, క్రీమ్, కల్చర్ అనే మూడు పదార్థాలతో గమ్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా దీనిని తయారు చేస్తున్నారు. వీటికి భారతీయ వంటకాల స్ఫూర్తితో వివిధ రకాల రుచులను జోడిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌తోపాటు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, తన వ్యాపారాన్ని మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఓ స్టార్టప్ అంతర్జాతీయ వేదికపై స్వర్ణం సాధించడం నగర ఆహార, పారిశ్రామిక రంగాలకు గర్వకారణంగా నిలిచింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


