ప్రభుత్వ భూముల వేలం ఆపాలి - భవిష్యత్ తరాల కోసం భూమిని కాపాడాలి : ఎంసీపీఐ(యు)
మల్లంపల్లి, నవంబర్ 25: ప్రభుత్వ భూములను వేలం వేయడం వెంటనే నిలిపివేయాలని ఎంసీపీఐ(యు) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి గుండెబోయిన చంద్రయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం మల్లంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మెమోరాండం అందజేశారు. ఎంసీపీఐ(యు) మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం భూములు అమ్ముతోందని, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు కాజేస్తోందని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే విధానాలను కొనసాగిస్తోందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు కోకాపేట, గచ్చిబౌలి, ఉస్మాన్ సాగర్, పోచారం, బండ్లగూడ, రావిలాల, పరిగి, నల్లగొండ, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంపన్న వర్గాలకు వేలం వేసి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 100/101లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని ప్రతిపాదించారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలతో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, మామునూరు వద్ద విమానాశ్రయం నిర్మాణం పేరుతో వందలాది ఎకరాల పేదల భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ భూములను కేవలం రాబోయే తరాల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్మాణం కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రజా అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల అవసరం కోసం భద్రపరచాలని కోరారు. మియాపూర్ సర్వే నంబర్ 100/101 భూముల్లో గత 30 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న ప్రజలందరికీ పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూముల వేలం పాటలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి రాజమౌళి, ముక్కాల మల్లయ్య, వేముల శ్రీనాథ్, మాతంగి కుమారస్వామి, దామెరకొండ రమేష్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


