వైభవంగా విఠలేశ్వరుని జాతర.. మహిళల సందడి ఆకట్టుకున్న అంతర్రాష్ట్ర మల్లయోధుల కుస్తీ పోటీలు
తానూర్, : మరో పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన తానూర్ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా ముగిశాయి. మంగళవారం నిర్వహించిన జాతరకు తానూర్‌తో పాటు పరిసర గ్రామాలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విఠల రుక్మాబాయి స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో మహిళలు, చిన్నారుల సందడి నెలకొంది. ప్రధాన రహదారులు, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. వైభవంగా రథోత్సవం కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆశీనులను చేసి రథోత్సవం నిర్వహించారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. పురవీధుల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మల్లయోధుల కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణ జాతరలో నిర్వహించిన అంతర్రాష్ట్ర మట్టి కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, నాందేడ్, పర్భణి, బిలోలి, ముద్‌ఖేడ్‌తో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి తమ ప్రతిభను చాటుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను తిలకించేందుకు గ్రామస్తులు, యువకులు పెద్దసంఖ్యలోహాజరయ్యారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.11,551 నగదుతో పాటు వెండి కడియం, ద్వితీయ బహుమతిగా రూ.9,051 నగదుతో పాటు వెండి కడియం అందజేసి ఘనంగా సత్కరించారు. పోలీసుల బందోబస్తు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగంధ మాధవరావు పాటిల్, ఉప సర్పంచ్ ఫారూక్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు దొంతుల పోశెట్టి, మాజీ సర్పంచులు విఠల్, రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుండ్లిక్, ఆలయ ఉపాధ్యక్షుడు అనిల్, క్యాషియర్ పోశెట్టి, మాజీ అధ్యక్షులు పండరి, గోవింద్ పాటిల్, శివాజీ పాటిల్, సోమనాథ్, విఠల్, ఆలయ పూజారి సచిన్ పాఠక్, ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

