అంకితభావం, నిరాడంబర జీవితం అబానీ రాయ్‌కు చిరస్మరణీయం
RSP పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కటారి రాములు
నిజామాబాద్: రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ నుండి మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన కామ్రేడ్ అబానీ రాయ్ 5వ వర్ధంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందేవాడలో గల ఆర్‌ఎస్‌పీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కటారి రాములు మాట్లాడుతూ, కామ్రేడ్ అబానీ రాయ్ పార్టీ నిర్మాణం, కార్మిక ఉద్యమాల బలోపేతం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తన జీవితమంతా అంకితం చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి వివాహం చేసుకోకుండా పార్టీ, ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ విప్లవ నాయకుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. అబానీ రాయ్ 1959లో ఆర్‌ఎస్‌పీలో చేరి యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC) ప్రధాన కార్యదర్శిగా కార్మికుల హక్కుల కోసం విశేషంగా పోరాడారని, అనంతరం పార్టీ కేంద్ర సెక్రటేరియట్ సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. 1998 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా సేవలందిస్తూ దేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమాల గొంతుకగా నిలిచారని అన్నారు. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జానకి రాములుతో కలిసి రాష్ట్రంలో పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేసి, పార్టీ విస్తరణకు కీలక పాత్ర పోషించారని కటారి రాములు గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలోనే పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. 1940 మార్చి 19న బీహార్ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌లో ఆర్‌ఎస్‌పీ ఆవిర్భవించిందని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు కార్మికులు, రైతులు, పేద ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తూ దేశ రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RYF జిల్లా కన్వీనర్ పిట్ల.నరేష్, నాయకులు గోపాల్ సింగ్ ఠాకూర్, చరణ్, ఇపాన్, తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


