బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపెల్లీ శ్రీధర్ అధ్యక్షతన ఒక్క రోజు నిరసన దీక్ష:
బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ రాజన్న ఆలయ గోపురం తొలగింపుపై భగ్గుమన్న వివాదం.. బిజెపి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష,దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ విమాన గోపుర శిఖరాన్ని తొలగించడంపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు మరియు పలువురు రాజన్న భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆలయ ప్రధాన శిఖరాన్ని తొలగించడం వల్ల కోట్లాది మంది హిందువుల, రాజన్న భక్తుల, మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బిజెపి నేతలు ఆరోపించారు. ఆలయ పనులు ప్రారంభించినప్పుడు ప్రధాన ఆలయానికి, విమాన గోపురానికి ఎలాంటి నష్టం కలిగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూన్నారని, విమర్శించారు.పనులు ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతున్నాయని, చెబుతున్న ప్రభుత్వం, అందుకు సంబంధించిన అనుమతి పత్రాలను, ప్లానింగ్ మరియు ఖర్చుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని నేతలు డిమాండ్ చేశారు.వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ (వి టి డి ఎ) అధికారులు మరియు దేవాదాయ శాఖ తీరుపై,వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఎండోమెంట్ సెల్ కన్వినర్ సత్యనారాయణ వేములవాడ పట్టణ బిజెపి కౌన్సిలర్లు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


