విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధం
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు
అందోల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఓ నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్లముందే మంటల్లో కాలి బూడిదైంది.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎరుకలి మోహన్ గ్రామంలో పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయన నివాసముంటున్న పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే మంటలు గుడిసె మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.ఇంట్లో ఉన్న బట్టలు,నిత్యావసర సామగ్రితో పాటు డీజే నిర్వహణకు సంబంధించిన రెండు ల్యాప్ టాప్ లు,నగదు సైతం అగ్నికి ఆహుతయ్యాయి.ఈప్రమాదంలో సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ యాదగిరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయిందని సర్పంచ్ యాదగిరి,ఉపసర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.కట్టు బట్టలతో మిగిలిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం,దాతలు ఆదుకోవాలని బాధితుడు మోహన్ వేడుకుంటున్నాడు. నిరుపేద కుటుంబానికి తక్షణ ఆర్థికసహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


