ములుగు శ్రీక్షేత్రంలో ఘనంగా ‘కౌన్ జాగరే’ - క్షీరమే క్షీరామృతం
ములుగు, : కార్తీక పౌర్ణమి రోజైన మంగళవారం ములుగులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం (శ్రీక్షేత్రం) లో ‘కౌన్ జాగరే’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతూ వస్తోంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12:30 వరకు జరిగిన కార్యక్రమంలో సుమారు 110 మంది భక్తులు పాల్గొన్నారు. క్షీరామృతం విశిష్టత కార్తీక పౌర్ణమి రోజున ప్రసరించే చంద్రకిరణాలకు అమితమైన శక్తి ఉంటుందని పెద్దల నమ్మకం. ఆ వెన్నెల వెలుగులో చిక్కటి పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి సుమారు నాలుగు గంటల పాటు మరిగించి తయారుచేసిన పాలనే క్షీరామృతం అంటారు. క్షీరమంటే పాలు. పాలే అమృతం. చంద్రుడు అమృతానికి అధిపతి. ఆ చంద్రకిరణాలు పడిన క్షీరాన్ని సేవిస్తే శరీరంలో నూతన శక్తి పుడుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మనసు ప్రశాంతంగా మారుతుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఈ క్షీరామృతాన్ని కేవలం ప్రసాదంగా కాకుండా, అమృత తుల్యంగా భావించి భక్తితో స్వీకరించారు. భక్తి గీతాలు, ఆటపాటలతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గండ్రకోట కుమార్, ఉజ్జల లింగన్న, కొత్తపల్లి బాబురావు, నూనె బిక్షపతి, సిరికొండ బలరాం, గంగిశెట్టి రాజకుమార్, ఎలుకదుర్తి రాజన్న, భూక్య జవహర్, వాంకుడోత్ జ్యోతి, మాదం లలిత తదితర భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


