మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవుల్లో గుర్తింపు ఇవ్వాలి – ఎం.డి. జహీర్
మిడ్జిల్, : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, పార్టీ జెండా మోస్తున్న మైనార్టీ యువతకు సైతం నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్త ఎం.డి. జహీర్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని కోరారు. మిడ్జిల్ మండల సింగిల్ విండో చైర్మన్ పదవిని మైనార్టీ వర్గానికి చెందిన యువకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాము ఎంతో కష్టపడ్డామని, గ్రామ గ్రామానికి, ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరామని తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలుగా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించి వారికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తల సేవలను వినియోగించుకుంటున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గుర్తింపు, పదవులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. మిడ్జిల్ మండలంలో సింగిల్ విండో చైర్మన్ పదవిని మైనార్టీ వర్గానికి చెందిన యువతకు కేటాయించి, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని మరీమరీ కోరుతున్నామని తెలిపారు. తమలాంటి కష్టపడే కార్యకర్తలకు ఒక అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఎం.డి. జహీర్ కాంగ్రెస్ కార్యకర్తగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


