కాగితాలపైనే రోడ్డు బాగుంది.. క్షేత్రస్థాయిలో గుంతల రాజ్యం.!
లోకాయుక్తను ఆశ్రయించినా మారని రహదారి దుస్థితి.. నేడు (25న) మళ్లీ విచారణ. ప్రమాదపు అంచున మంజీరా నది బ్రిడ్జి.. వాహనదారులకు నరకయాతన. మీడియాతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం.
అల్లాదుర్గం : ప్రజా రవాణాకు అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర రహదారి అధికారుల నిర్లక్ష్యానికి,కాగితపు లెక్కలకు బలైపోతోంది.మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం డాగ్ బంగ్లా నుండి మెటల్‌కుంట (జహీరాబాద్ - బీదర్ మార్గం) వరకు ఉన్న సుమారు 40 కిలోమీటర్ల రహదారి అడుగడుగునా భారీ గుంతలతో అధ్వానంగా మారింది.ఈ రహదారి దుస్థితిపై సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మంగళవారం మీడియా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి,వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తెచ్చారు. నివేదికల్లో మరమ్మతులు.. క్షేత్రస్థాయిలో శూన్యం: గతంలో ఇదే రహదారి దుస్థితిపై కంచరి బ్రహ్మం తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయించారు. అప్పట్లో ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయని నివేదిక సమర్పించడంతో 2024లో ఆ కేసు ముగిసింది.అయితే పనులు పూర్తయ్యాయని చెబుతూనే.. మరోవైపు పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని అధికారులే తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం.క్షేత్రస్థాయిలో పనులు జరగకుండానే నివేదికలు ఇచ్చారని గుర్తించిన బ్రహ్మం, కేసును తిరిగి విచారించాలని లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై బుధవారం 25 లోకాయుక్తలో విచారణ జరగనుంది. ప్రయాణం నరకయాతన.. ప్రమాదకరంగా మంజీరా బ్రిడ్జి: మీడియా బృందంతో కలిసి 40 కిలోమీటర్ల మేర పరిశీలించగా, వందలాది గుంతలతో రోడ్డు ఆనవాళ్లు కోల్పోయి కనిపించింది.నిత్యం ఈమార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, లారీ యజమానులు,ద్విచక్ర వాహనదారులు,ప్రయాణికులు తమ బాధను వెళ్లగక్కారు. గుంతల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని, ప్రయాణం నరకయాతనగా మారిందని, కనీసం పట్టించుకునే నాయకులు, అధికారులు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే మార్గంలో మంజీరా నదిపై ఉన్న సుమారు 300 మీటర్ల పొడవైన బ్రిడ్జి సైతం పెద్ద పెద్ద గుంతలతో శిథిలావస్థకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.సమగ్ర విచారణ జరిపించాలి,ఈ సందర్భంగా కంచరి బ్రహ్మం మాట్లాడుతూ.. "ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నా ప్రజలకు సురక్షితమైన రహదారిని ఎందుకు నిర్మించలేదు? గతంలో లోకాయుక్తకు తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలి. ప్రజా రవాణా దృష్ట్యా తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి,మంజీరా బ్రిడ్జి భద్రతకు చర్యలు తీసుకోవాలి" అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


