మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
చెడు వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
- అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్
మెదక్, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్య, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విద్య, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో నేటి విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా నష్టపోతాయని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని, చెడు స్నేహాలకు, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రోత్సహించారు. వైఫల్యాలకు భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా భావించాలని తెలిపారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చాలని, క్రీడలు, ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, సరైన మార్గదర్శకత్వం, అంకితభావంతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని స్ఫూర్తినిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన యువతతోనే సమాజం, దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


