*అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం... జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రభుత్వ సలహా దారు సుదర్శన్ రెడ్డి
చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ బీమాతో నిరుపేదలకు ఆర్థిక భరోసా *బజార్హత్నూర్లో ఘనంగా నూతన పెన్షన్ మంజూరు పత్రాలు, కుటుంబ బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం లో ....ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి,* జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా నిలిచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేయూత ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తుందని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, వెనుకబడిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా అర్హులైన వారికి చేయూత పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. పెన్షన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14,579 నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బోథ్ నియోజకవర్గ పరిధిలో సుమారు 6 వేల పెన్షన్లు, బజార్హత్నూర్ మండలంలో 600కు పైగా పెన్షన్లు ఉన్నాయని వివరించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి పెన్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైన ఒక్క రోజులోనే జిల్లావ్యాప్తంగా 80 ప్రత్యేక శిబిరాల ద్వారా 5,536 కుటుంబాలను నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నెల రోజుల్లోగా అర్హులైన కుటుంబాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల బీమా ఆర్థిక సహాయం అందించే ఈ పథకంలో అర్హులైన ప్రతి కుటుంబం నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం ముఖ్య అతిథులు పలువురు లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, డీఆర్టీఓ రవీందర్ రాథోడ్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

