ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ప్రతి డివిజన్‌లో ఇప్పటివరకు ఎంతమంది పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్నారు, ఇంకా ఎంతమంది నమోదు చేసుకోవాల్సి ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు ఆవశ్యకతను తెలియజేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఓటు నమోదు విషయంలో ఎవరికైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వాటిని నివృత్తి చేసి, వీలైనంత ఎక్కువ మంది పట్టభద్రుల ఓట్లు నమోదు అయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఓటు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ, అర్హులైన పట్టభద్రులందరి ఓటు నమోదు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


