డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (APAS), అమరావతి ప్రకటించిన సాంకేతిక మరియు ఇంజినీరింగ్ శాస్త్రాల విభాగంలో యువ శాస్త్రవేత్త గుర్తింపునకు ఎంపికయ్యారు. ఇంజినీరింగ్ శాస్త్ర రంగంలో ఆయన అందిస్తున్న విద్యా, పరిశోధనా సేవలు మరియు భవిష్యత్తులో పరిశోధనల ద్వారా మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యానికి ఈ గుర్తింపు లభించింది. 1963లో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రాష్ట్రంలో శాస్త్రీయ పరిశోధనలను, విద్యా ప్రమాణాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా 2027లో నిర్వహించనున్న *ఏపీఏఎస్-2027 కార్యక్రమంలో* డా. బాలసుబ్రహ్మణ్యంకు యువ శాస్త్రవేత్త సర్టిఫికెట్‌తో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు. అంతేకాకుండా యువ శాస్త్రవేత్తలకు, యంగ్ రీసెర్చర్స్ ఫోరమ్ సభ్యులకు కల్పించే ప్రత్యేక సదుపాయాలు, గౌరవాలు ఆయనకు లభించనున్నాయి. డా. బాలసుబ్రహ్మణ్యం ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపునకు ఎంపిక కావడం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి గర్వకారణమని, విశ్వవిద్యాలయ పరిశోధనా మరియు విద్యా రంగ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


