ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి
రంగారెడ్డి జిల్లా బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంట్లో ఆదివారం లబ్ధిదారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి ఘనంగా దీపావళి సంబరాలను జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లిలో జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బొడిగే అనసూయ, భర్త అశోక్, నడిమింటి అనురాధ, భర్త వెంకట్ రావు,నివాసాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి పేద కుటుంబంలో సంతోషం, వెలుగులు నిండాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ ఎం. చైతన్య కుమార్, పీడీ హౌసింగ్ డి. చంప్లా నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


