బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
ఎన్నికల హామీలు అమలు చేయాలి.. మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీల చిరకాల కోరిక అయిన మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం ఇప్పటికీ హామీలకే పరిమితమైందని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనూ ఫంక్షన్ హాల్ నిర్మాణంపై హామీలు వినిపిస్తున్నప్పటికీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మైనార్టీల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చిన నాయకులు, అధికారం చేపట్టిన తర్వాత వాటి అమలుపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మూడేళ్లు గడుస్తున్నా మైనార్టీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. మైనార్టీ ఫంక్షన్ హాల్ అనేది విలాసవంతమైన సదుపాయం కాదని, పేద, మధ్యతరగతి కుటుంబాలు వివాహాలు, ఇతర శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన ప్రజా సదుపాయమని తెలిపారు. మైనార్టీల ఓట్లు ఎన్నికల సమయంలో అవసరమని భావించడం కాకుండా, వారి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎప్పుడు నిధులు కేటాయిస్తారు? పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు, నిర్మాణ పనుల ప్రారంభానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

