అంత్యక్రియలకు వెళ్లిన వారి ఇళ్లే టార్గెట్..
ఐదు కేసులు.. భారీగా ఆభరణాల స్వాధీనం.. పాత నేరస్తుడి ఆటకు పోలీసుల చెక్!
జడ్చర్ల : అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో ఐదు దొంగతనాల కేసులను ఛేదించినట్లు జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, ఉమ్మాజూట్ పరిధిలో ఇంటికి తాళం వేసి వెళ్లిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి, బీరువాలను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గాంధీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు బోయ కృష్ణయ్య (70)గా గుర్తించారు. గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి నుంచి 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచవద్దని పోలీసులు సూచించారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


