కూకట్పల్లి ట్రక్ పార్క్ స్థలాన్ని విక్రయించవద్దంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అసోసియేషన్ సభ్యుల వినతి:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాలకు చెందిన అసోసియేషన్ సభ్యులందరూ బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని కలిసి, కూకట్పల్లిలోని ట్రక్ పార్క్ స్థలాన్ని విక్రయించకుండా కాపాడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ,భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా మిగిలి ఉన్న ఏకైక విశాలమైన స్థలం ట్రక్ పార్క్ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూకట్పల్లి ప్రాంతం దాదాపు 25 లక్షల జనాభాతో విస్తరించే అవకాశం ఉందని, ఇప్పటికే హైరైజ్ భవనాల నిర్మాణంతో జనాభా పెరుగుదల వేగంగా జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ ట్యాంకులు, క్రీడా మైదానాలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, అలాంటి ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే ఏకైక స్థలం ట్రక్ పార్క్ అని వివరించారు. అలాంటి విలువైన స్థలాన్ని కూడా విక్రయించి ప్రజలకు దూరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు, అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడుకుంటూ వచ్చామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. నేడు మాత్రం ప్రజల భవిష్యత్తు అవసరాలను పక్కనపెట్టి స్థలాలను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ భూముల విక్రయం ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుని ఢిల్లీకి పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పుడున్న ప్రజా అవసరాలను మాత్రమే కాకుండా, రాబోయే తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ విలువైన స్థలాలను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనం ఏమి మిగిల్చగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ట్రక్ పార్క్ స్థలం వద్ద మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వానికి ప్రజల తరఫున విజ్ఞప్తి చేయాలని, స్థలాన్ని విక్రయించకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, కూకట్పల్లి, మూసాపేట నివాసికుల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


