అభివృద్ధిలో నాంపల్లి మండలం వెనుకబాటు..
మునుగోడు నియోజకవర్గంలో మండలాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం.
నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, బస్టాండ్ లేవు..
నాంపల్లి వెనుకబడటానికి కారణం ఏమిటి?
అధికారుల నిర్లక్ష్యమా? ప్రజాప్రతినిధుల పట్టింపులేమా? అభివృద్ధిపై ప్రజల్లో చర్చ!
నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి
రెవెన్యూ డివిజన్ అయితే నాంపల్లి అభివృద్ధి చెందుతుందని ప్రజల అభిప్రాయం
నాంపల్లి: మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో నాంపల్లి మండలం వెనుకబడిపోతుండగా, మరోవైపు చుట్టుపక్కల మండలాలు అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఒకే నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాల మధ్య అభివృద్ధి విషయంలో ఇంతటి వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చుట్టుపక్క మండలంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయని స్థానికులు అభిప్రాయపడుతుండగా, నాంపల్లి మండలంలో మాత్రం అనేక సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధికి ఆమడ దూరంలో నాంపల్లి!
నాంపల్లి మండలంలో డిగ్రీ కళాశాల, బస్టాండు, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి లేక విద్యార్థుల ప్రయాణికుల రోజుల ఇబ్బందులు చెప్పలేనివి.. రహదారుల పరిస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, విద్య, వైద్యం, పారిశుధ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అనేక అంశాల్లో మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రధాన రహదారులపై గుంతలు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి సమస్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన నాంపల్లి మండలంలో సాగునీరు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.మరో వైపు ప్రాజెక్టు పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో చెరువులు, కుంటల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై కూడా సంబంధిత శాఖలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
నాంపల్లిలో ఎందుకు మందగమనం?*
మునుగోడు, చింతపల్లి, మర్రిగూడెం, గుర్రంపోడు, చండూరు మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే నాంపల్లి మండలంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రజలు చెబుతుండగా, నాంపల్లి మండలానికి అవసరమైన నిధులు, కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రత్యేక దృష్టి ఎందుకు పూర్తిస్థాయిలో లభించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అభివృద్ధి అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపించేలా ఉండాలి. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించడం, నిధులు మంజూరు చేయించుకోవడం, మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయించడం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత. ఈ విషయంలో నాంపల్లి మండలానికి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.నాంపల్లి మండలం అభివృద్ధిలో వెనుకబడటానికి కారణాలు ఏమిటి? అధికారుల నిర్లక్ష్యమా? ప్రజాప్రతినిధుల పట్టింపులేమా? లేక నిధుల కొరతా? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మండలంలోని సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారా? అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోందా? అనే అంశాలపై కూడా సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది.మండల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సూచిస్తున్నారు.
నాంపల్లికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కావాలి!*
పక్క మండలమైన చండూరు మండలం తరహాలో నాంపల్లి మండలాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని పెండింగ్ పనులను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ప్రశ్న ఒక్కటే.. నాంపల్లికి అభివృద్ధి ఎప్పుడు?
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒక మండలం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే మరో మండలం వెనుకబడిపోవడం సరైన పరిస్థితి కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నాంపల్లి మండలంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నాంపల్లి మండల అభివృద్ధికి బాటలు వేస్తారా? లేక సమస్యలు అలాగే కొనసాగుతాయా? అనేది వేచి చూడాల్సిందే.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

