పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

  • -తెలంగాణ రాబిన్‌హుడ్‌కు తగిన గౌరవం ఇవ్వాలి
  • -సామాజిక నాయకుడు ఊదరి లక్ష్మణ్ డిమాండ్

పెద్దపల్లి : ఆగస్టు 8న జరగనున్న ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సామాజిక నాయకుడు ఊదరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాకు విడుదలచేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదిగి ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను ప్రభుత్వం అధికారికంగా గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పండుగ సాయన్న తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ప్రజా వీరుడని, నిజాం పాలనలో వెట్టిచాకిరి, అక్రమ పన్నులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలోని మెరుగోనిపల్లె గ్రామంలో జన్మించిన సాయన్న తన జీవితాన్ని బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే అంకితం చేశారని తెలిపారు. పేద కుటుంబాల ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు నిర్వహించడం, బంగారు పుస్తెల తాళ్లు, కొత్త బట్టలు, భోజన ఏర్పాట్లు చేయించడం ద్వారా ఆయన గొప్ప సామాజిక సంస్కర్తగా నిలిచారని అన్నారు. అంతేకాకుండా కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమానత్వ భావనను సమాజంలో పెంపొందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. కేవలం 35–38 ఏళ్ల వయసులోనే కుట్రపూరితంగా హత్యకు గురైన పండుగ సాయన్న త్యాగం తెలంగాణ సమాజానికి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరాలకు తెలియజేయడం అత్యంత అవసరమని ఊదరి లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారిక ఉత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి యువతకు పరిచయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ముదిరాజ్ సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆగస్టు 8న జరిగే జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజావీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.
 
 
Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News