శంకుస్థాపన చేశారు సరే.. మరి నిధులు ఎటు వెళ్లాయి.
- అధికారులను నిలదీసిన రేకుర్తి వాసులు
- సీసీ రోడ్డు వేయాలని డిమాండ్..
- గుంతల రోడ్డుపై బైఠాయించి కాలనీవాసుల నిరసన
కొత్తపల్లి : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 19, 20వ డివిజన్లకు సంబంధించిన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువ గుంతల రోడ్డును వెంటనే సీసీ రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తూ పలు కాలనీల ప్రజలు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్ హిల్స్, శేఖభీ కాలనీ, సింహాద్రి కాలనీ, స్వామి కాలనీలకు చెందిన ప్రజలు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని, పాదచారులు నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. చివరికి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే బస్సు సైతం ఈ గుంతల రోడ్డులో ఇరుక్కుపోయిందని వారు గుర్తుచేశారు. ఇక్కడ ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని, సుమారు ఐదు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తారని కాలనీవాసులు తెలిపారు. అంతేకాకుండా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట దేవస్థానం, మసీదు ప్రార్థనా మందిరం కూడా ఈ రోడ్డు మార్గంలోనే ఉన్నాయని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న రోడ్డును అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల ముందే స్థానిక ఎమ్మెల్యే ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారని, కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పనులకు సంబంధించిన నిధులు ఏమయ్యాయంటూ వారు అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణమే సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ భర్త వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు తమ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎండి సైఫ్, వాజీద్, బబ్లు, ఖమర్, షేకిల్, గడ్డం దామోదర్, శంకర్ రావు, రామ్ సింగ్ మరియు పలు కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం: 19వ డివిజన్ కార్పొరేటర్
ఈ సమస్యపై 19వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి- కృష్ణ గౌడ్ స్పందిస్తూ.. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాద నలను ఇప్పటికే నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఉన్నతాధికారుల నుండి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Views: 160
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
