జైపాల్ రెడ్డి స్ఫూర్తి చిరస్మరణీయం
మహబూబ్‌నగర్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ.శే. ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నివాళులర్పించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి, చిత్రపటానికి కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్, అధ్యాపక బృందం పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి జయంతి, వర్ధంతి సందర్భాల్లో ప్రతి ఏడాది ఇద్దరు ప్రముఖులకు "జైపాల్ రెడ్డి స్మారక స్పూర్తి పురస్కారం" అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన విశ్రాంత అధ్యాపకులు ఆలూరు గంగయ్య, రావూరి సూర్యనారాయణలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు చెక్కుతో పాటు సన్మానించినట్లు చెప్పారు.జైపాల్ రెడ్డి దేశం గర్వించదగిన మహానాయకుడని, అంగవైకల్యాన్ని అధిగమించి అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగారని రవికుమార్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని, శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారని పేర్కొన్నారు. 1984 నుంచే జైపాల్ రెడ్డితో తనకు సన్నిహిత పరిచయం ఉందని, ఆయన వద్ద శిష్యరికం చేశానని, తనను దత్తపుత్రుడిగా భావించేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే 1997లో జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించామని చెప్పారు. తమ విద్యాసంస్థలు ఈ ఏడాది 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటివరకు సుమారు 30 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినట్లు వివరించారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి రాజకీయాలకు ఆదర్శప్రాయమైన నాయకుడని అన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయ ప్రత్యర్థులమని, అనంతరం ప్రజల అభివృద్ధే అందరి లక్ష్యమని ఆయన చెప్పేవారని గుర్తుచేశారు. ఆయన పేరిట విశిష్ట సేవలందించిన ప్రముఖులను సన్మానించడం అభినందనీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్ రెడ్డి సాధించిన గుర్తింపు ఆయన పట్టుదల, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ సి. భాస్కర్, కార్యదర్శి వి. వెంకటరామరావు, ప్రిన్సిపల్ డా. పి. కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. వి.ఈ. చంద్రశేఖర్, వీఐపీ సంస్థకు చెందిన డా. టి. నాగేందర్, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు, నస్కంటి వీరన్న, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 61
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
