ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ఉట్నూర్, : ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉట్నూర్ లోని కేబీ కాంప్లెక్స్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ ప్రజలు, నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు, రాయి సెంటర్ పెద్దలు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ భవనం నుంచి కేబీ కాంప్లెక్స్ వరకు ఆదివాసీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం కేబీ కాంప్లెక్స్లోని కొమురం భీం విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా కలె క్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మక రందు, ఏఎస్పీ రిత్విక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్య అతిథులు, అధికారులు సందర్శించారు. ఆదివాసీల సాంప్రదాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు లడ్డూ స్టాల్, హస్తకళల స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల తయారీ విధానం, వాటి ప్రత్యేకత లను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ కళలు, సంప్రదాయ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఆదివాసీ కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, దెంసా నృత్యాలతో విద్యార్థులు అలరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


