కబ్జా కాదు.. మా స్థలమే!
మా స్థలంపై తప్పుడు ప్రచారమెందుకు? తప్పుడు ప్రచారంపై రాజయ్య కుటుంబం ఫైర్
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో స్థలం కబ్జా జరిగిందంటూ వస్తున్న అవాస్తవాలను మోకనపల్లి రాజయ్య కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. వివాదాస్పద స్థలం తమ కుటుంబానిదేనని, ప్రతాప్‌కు తామే కిరాయికి ఇచ్చామని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న చిన్న షెడ్డును తొలగించి పెద్దదిగా నిర్మించుకునేందుకు కూడా తామే అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాంటప్పుడు కబ్జా ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారం సాగించడం ఏమిటని ప్రశ్నించారు. 1950వ దశకం నుంచే తమ కుటుంబం కన్నాలలో నివసిస్తోందని, అప్పట్లో మానవతా దృక్పథంతో సర్వేష్‌కు ఇంటి పక్కన కొంత స్థలం ఇచ్చామని రాజయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుమారు 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సర్వేష్ స్థలంపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులను అడ్డుపెట్టుకుని డబ్బులు ఇవ్వాలని, లేదంటే స్థలం అప్పగించాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి తెరదించి, వాస్తవాలను విచారించి తమకు న్యాయం చేయాలని అధికారులను, పోలీసులను కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


