ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంపై అవగాహన పెంచుకోవాలి జంగపెల్లి ఐలయ్య
హుస్నాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ చైర్మన్ జంగపెల్లి ఐలయ్య కోరారు. ఈ సందర్భంగా జంగపెల్లి ఐలయ్య మాట్లాడుతూ.. పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో అనుకోని సంఘటనల వల్ల కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతు కుటుంబాలు, కూలీలు, నిరుపేద కుటుంబాలకు ఇలాంటి జీవిత బీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ తదితర మండలాల ప్రజలు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని, అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాల గురించి సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఉద్దేశం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


