మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
ఆదర్శ మహిళలతో విద్యార్థినుల ముఖాముఖి’ కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన డాక్టర్ ప్రియాంక
మల్హర్ : తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్లపల్లిలో పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా ‘ఆదర్శ మహిళలతో విద్యార్థినుల ముఖాముఖి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘మహిళా సాధికారత – లింగ సమానత్వం’ అనే అంశంపై మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక 8, 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, విద్యార్థినులు కూడా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే చదువుకు పటిష్టమైన పునాది ఏర్పడుతుందని, ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు.తాను విద్యార్థి దశలో అనుసరించిన చదువు ప్రణాళిక, ఫార్మకాలజీ రంగంలో డాక్టర్‌గా ఎదిగిన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ, ఔషధాల తయారీ విధానం, ఔషధాల అవసరం, మోతాదులు, వైద్య మరియు పారామెడికల్ కోర్సుల ప్రాధాన్యత గురించి వివరించారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి పాఠశాల పూర్వ ప్రిన్సిపాల్ శివశంకర్ సార్ అందించిన ప్రేరణ ఎంతో దోహదపడిందని గుర్తుచేశారు. ప్రతి ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకోవాలని, గురువుల బోధనలే విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. సహ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని, ఆదర్శ మహిళ డాక్టర్ ప్రియాంకను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులందరూ ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


