వరద కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి నీరు వృథా కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి
అధికారులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం
నిజామాబాద్ : కమ్మర్పల్లి శివారులోని వరద కాలువ 24వ కిలోమీటర్ వద్ద లైనింగ్ దెబ్బతిని రంధ్రం ఏర్పడటంతో నీరు వృథాగా పోతుందని కమ్మర్పల్లి మండల రైతులు శనివారం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వరద కాలువ డీఈ గణేష్ గారికి ఫోన్ చేసి సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలువ లైనింగ్ కొంతమేర లోపలికి జరిగి దెబ్బతిన్నట్లు, తాను ఏఈ గారితో కలిసి గత వారమే క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించినట్లు డీఈ వివరించారు. మరమ్మతుల కోసం జీవో 45 కింద ఎస్టిమేట్ రూపొందించి పంపిస్తామని అధికారి తెలపగా, ప్రత్యేక నిధుల (స్పెషల్ ఫండ్స్) కింద ఈ పనులను తొందరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రస్తుతం కాలువలో నీరు లేకపోయినప్పటికీ, రానున్న రోజుల్లో నీటి ప్రవాహం ప్రారంభమైనప్పుడు లీకేజీని అరికట్టకపోతే విలువైన సాగునీరు వృథాగా పోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువ బండ్ వెడల్పు బాగానే ఉందని, రంద్రం పడిన చోట మరమ్మతులు వెంటనే పూర్తి చేస్తామని డీఈ తెలపగా, తాను ఫోన్ చేసి సమస్యను వివరించిన విషయాన్ని ఎస్‌ఈ (SE), ఈఈ (EE) అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి, వారి సమన్వయంతో వీలైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేయించాలని డీఈ గణేష్ గారిని ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


