చౌటకూర్‌లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు ఘనంగా భూమిపూజ
* భూగర్భ జలాల సంరక్షణే లక్ష్యంగా వివిజి రామ్ జీ కార్యక్రమం ప్రారంభం * నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి
చౌటకూర్, : చౌటకూర్ మండల కేంద్రంలో వివిజి రామ్ జీ కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శనివారం ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో భూగర్భ జలమట్టాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ ప్రధాన లక్ష్యంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామ సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భూమిపూజ కార్యక్రమంలో మొత్తం 50 ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు వృథాగా మురుగు కాలువల ద్వారా బయటకు పోకుండా, ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి ఇంకేలా శాస్త్రీయ చర్యలు తీసుకోవడం వల్ల గ్రామంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు. భవిష్యత్తులో వేసవి కాలంలో తాగునీరు, సాగునీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా గ్రామాన్ని జలకళతో సస్యశ్యామలంగా మార్చుకోవచ్చని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, వార్డు సభ్యులు బాల్, గోరేమియా, చక్రపాణి, అశోక్, దమ్మి కిట్టు, పేట గంగారం, అనురాధలతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


