చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్
మంచిర్యాల(క్రైమ్) : ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటికే 11 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని, దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదో బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లోనే 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేత కోసం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లుకు రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కోరారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళల వాటాను తేల్చాలని, 2027లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనగణనలో ఓబీసీ కాలమ్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చించి పరిష్కరించాలని, లేనిపక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, అశోక వేముల, గగ్గూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


