బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
బాలికల భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత పాల్వంచ కేజీబీవీ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
పాల్వంచ : బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలికల భవిష్యత్తును కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ కేజీబీవీ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌పర్సన్, న్యాయమూర్తి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా భరోసా సెంటర్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ చల్లా అరుణ మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి భరోసా సెంటర్ అందించే సహాయ సహకారాలను వివరించారు.అలాగే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) గురించి అవగాహన కల్పించారు. పిల్లలు సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లను వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనవసరమైన పరిచయాలు, ఆన్‌లైన్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని తెలిపారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాలికలకు విద్యతో పాటు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పడాలని కార్యక్రమంలో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భరోసా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, సపోర్ట్ పర్సన్ రామదేవి, జిల్లా అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 450 మంది ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


