అభివృద్దిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారం
స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ): చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దిని చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసత్య ప్రచారం చేస్తున్నాడని దేవస్థాన పాలకమండలి సభ్యులు ద్వజమెత్తారు. శనివారం చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో చిల్పూరుగుట్ట దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. చైర్మన్ శ్రీధర్ రావు చొరవతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవస్థాన భూమి14 ఎకరాలు, గుట్ట పరిసర ప్రాంతాల్లో సానిటేషన్, ఎలక్ట్రిసిటీ, త్రాగునీటి సౌకర్యం, బ్రహ్మోత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం, గుట్టపైకి మెట్ల నిర్మాణం, భక్తులకు మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. భక్తి భావంతో పాటు సేవా దృక్పథంతో ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తూ భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. చిల్పూరుగుట్ట దేవస్థానం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దేవస్థాన పాలకవర్గం సమన్వయంతో కృషి చేస్తూ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు, భక్తులకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలని, రాజకీయ విమర్శల కంటే పుణ్యక్షేత్ర అభివృద్ధికి సహకరించడం ముఖ్యమని అన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థాన డైరెక్టర్లు ఎనగందుల రత్నాకర్ రెడ్డి, డాక్టర్ వేముల వెంకటేశ్వర్లు, దారం రాజన్ బాబు, గొల్లపల్లి వాసు, గూడెల్లి అరుణ, పుల్యాల నారాయణ రెడ్డి, బి కుమారస్వామి, భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


