సొసైటీ నియామకాల్లో మండల అధ్యక్షుల నిర్ణయానికే ప్రాధాన్యం: మహేష్ కుమార్ గౌడ్
ఈ నెలాఖరులోపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నాంపల్లిలోని గాంధీ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వీలైనంత త్వరగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు.టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని, పార్టీ అధ్యక్ష పదవిని బాధ్యతగా, సంతృప్తిగా నిర్వహించానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పార్టీకి బలాన్ని చేకూర్చామని, పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశామని తెలిపారు. రెండేళ్లలో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని అవలీలగా అధిగమించి పార్టీని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతలు మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షీ సహకారంతో పార్టీని నడిపామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. డీలిమిటేషన్ లేకపోతే తెలంగాణలో 17కి 17 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా కృషి చేస్తామని చెప్పారు.
కుల సర్వేతో సామాజిక న్యాయం
తెలంగాణలో కుల సర్వే ద్వారా నిజమైన సామాజిక న్యాయం జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా కుల సర్వేను శాస్త్రీయంగా, సమర్థవంతంగా నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కుల సర్వే అంశాన్ని తొక్కిపెట్టడం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దేశవ్యాప్తంగా కుల సర్వేను అమలు చేస్తామని చెప్పారు.
ఏఐసీసీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 57 శాతం వరకు బీసీలు విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించామని చెప్పారు.
DCC అధ్యక్షుల అభిప్రాయానికి ప్రాధాన్యం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో ఏఐసీసీ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీ నుంచి అబ్జర్వర్లను పంపించి, క్షేత్రస్థాయిలో సమీక్షించిన తర్వాతే డీసీసీ అధ్యక్షులను ప్రకటించామని చెప్పారు.
ఎమ్మెల్యే టికెట్ల విషయంలో డీసీసీ అధ్యక్షుల అభిప్రాయం కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. పీఏసీలో ఎమ్మెల్యే టికెట్‌పై చర్చకు ముందే సంబంధిత డీసీసీ అధ్యక్షుడి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా డీసీసీ అధ్యక్షుడిని కలవాలని సూచించారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకుంటున్నామని చెప్పారు.
సొసైటీ నియామకాల్లో మండల అధ్యక్షుల మాటకే ప్రాధాన్యం
సొసైటీ నియామకాల విషయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తల విషయంలో కొంతమంది ఎమ్మెల్యేల నుంచి ఇబ్బందులు ఎదురైనా మండల అధ్యక్షుల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏఐసీసీ నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్‌తో విభేదాలపై స్పష్టత
సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎక్కడా గొడవ జరగలేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే తమ మధ్య గ్యాప్ ఉందంటూ పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఏదైనా అంశంపై అభిప్రాయ భేదాలు వచ్చినా అదే రోజు సాయంత్రానికే వాటిని పరిష్కరించుకునేవారమని తెలిపారు. పార్టీ వ్యవహారాల్లో సీఎం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు.
క్రమశిక్షణ విషయంలో రాజీ లేదు
బీసీ మంత్రిని తొలగించిన సమయంలో తాను కూడా బాధపడ్డానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సురేఖపై చర్యలు తీసుకోవడానికి కారణాలు అందరికీ తెలుసునని, ఏఐసీసీ నిర్ణయం మేరకే ఆమెపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పి హద్దులు దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు.
తన అధ్యక్షతన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని గుర్తుచేశారు. రెండేళ్ల అధ్యక్ష పదవీకాలం ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాగిందని, పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


