రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ

రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ

  • పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు
  • 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, రాజన్న సిరిసిల్ల :శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం తిప్పాపూర్ గోశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు రైతులకు జతల కోడెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్నకు కోడె మొక్కు చెల్లించడం భక్తుల విశ్వాసంతో ముడిపడిన సంప్రదాయమన్నారు. గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే సమయంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో, నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా అర్హులను ఎంపిక చేసి పారదర్శకంగా కోడెలను పంపిణీ చేస్తోందని తెలిపారు.
కోడెలను జాగ్రత్తగా సంరక్షించాలి రాజన్న ప్రసాదంగా అందుకున్న కోడెలను రైతులు తమ బిడ్డల మాదిరిగా సంరక్షించాలని ఆది శ్రీనివాస్ కోరారు. అక్రమంగా తరలించడం లేదా ఇతర మార్గాల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడెల ఆరోగ్య పరిరక్షణకు టీకాలు, వైద్య సేవలు, నాణ్యమైన దాణా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యమైన దేశీ కోడెలనే సమర్పించాలి భక్తులు పాలు మరవని చిన్న కోడెలను స్వామివారికి సమర్పించవద్దని సూచించారు. దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను తరలించడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జెర్సీ జాతి కోడెలకు బదులుగా ఎదిగిన, ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని కోరారు. అనారోగ్యంతో ఉన్న కోడెలను చివరి దశలో గోశాలలో వదిలివేయకుండా ముందుగా అధికారులను సంప్రదించి అప్పగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. 45 ఎకరాల్లో అధునాతన గోశాల వేములవాడ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని గుర్తించి అధునాతన గోశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. అనారోగ్య కోడెల కోసం ఎకరం స్థలాన్ని ప్రత్యేకంగా వినియోగించనున్నట్లు చెప్పారు. ఆలయానికి ప్రత్యేక వెటర్నరీ వైద్యుడిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. భక్తులు నిర్ణీత రుసుం చెల్లించి ఆలయ అధికారుల ద్వారా నిజ కోడెను సమర్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత ఆధారంగా పారదర్శక పంపిణీ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆలయ ఈవో, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రైతుల ఎంపిక చేపట్టినట్లు తెలిపారు. భూమి, పశువుల సంరక్షణకు అవసరమైన మేత, నీరు, ఆహారం అందించే సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. ఆలయానికి భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంతో పాటు రూ.250 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ ఛైర్మన్ రాకేశ్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్, కౌన్సిలర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్