ఒకే రోజు వినాయక నిమజ్జనం..
యువజన సంఘాల ఏకగ్రీవ తీర్మానం
రాచర్ల బొప్పాపూర్‌లో శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం
ఎల్లారెడ్డిపేట, : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వివిధ యువజన సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి, ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వినాయక మండపాల యువజన సంఘాల సభ్యులతో నిమజ్జన కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలకు ఎలాంటి విఘాతం కలగకుండా, శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలోని అన్ని వినాయక విగ్రహాలను ఒకే రోజు నిమజ్జనం చేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా యువజన సంఘాల సభ్యులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సర్పంచ్, ఉపసర్పంచ్ సూచించారు. ఈ నిర్ణయానికి అన్ని యువజన సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించి, తీర్మానాన్ని ఆమోదించి సర్పంచ్, ఉపసర్పంచ్‌కు అందజేశారు. సమావేశంలో గ్రామంలోని వివిధ యువజన సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఐక్యతతో వినాయక నిమజ్జనం.. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతం చేద్దాం అని గ్రామ ప్రజలకు వారు పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


