దూదేకుల సామాజిక వర్గ అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి
దూదేకుల సాంస్కృతిక సదస్సులో వక్తల పిలుపు – ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్ల నిధుల మంజూరుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి కళాభవనంలో తెలంగాణ ముస్లిం దూదేకుల నూర్‌బాషా వెనుకబడిన తరగతుల సంక్షేమ జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఏ.సి.) రిజిస్ట్రేషన్ నం. 233/2026 ఆధ్వర్యంలో శనివారం దూదేకుల సాంస్కృతిక సదస్సు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 100 మంది దూదేకుల సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సులో జె.ఏ.సి. చైర్మన్ మహమ్మద్ రఫీ, వైస్ చైర్మన్ మహమ్మద్ రాజమ్మద్, గౌరవ అధ్యక్షులు షేక్ సత్తార్ సాబ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రుఖియా బేగం, సోగరా బేగం హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర సీనియర్ నాయకులు మహమ్మద్ నాసర్, రంజాన్, ప్రధాన కార్యదర్శి సంధాని, అదనపు ప్రధాన కార్యదర్శి సాజిద్ అహ్మద్, రాజ్ మహమ్మద్ (అల్లిపూర్), మహమ్మద్ ఇబ్రహీం (రేచపల్లి) పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి మహమ్మద్ షాజహాన్, బడేసాబ్ తదితరులు హాజరయ్యారు.
దూదేకుల సామాజిక వర్గ ఐక్యతే ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం దూదేకుల నూర్‌బాషా సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేయడం, విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేయడం, సామాజిక ఐక్యతను పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. దూదేకుల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, హక్కులు మరియు సంక్షేమ పథకాల అమలుకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవ భవనానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో రెండు ఎకరాల స్థలంలో దూదేకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్. నం.51 ద్వారా రూ.3 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై సదస్సులో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వక్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం దూదేకుల సామాజిక వర్గానికి ఐక్యత, ఆత్మగౌరవం, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా మరియు సామాజిక చైతన్యానికి కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.
దూదేకుల ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ను వెంటనే అమలు చేయాలి. గతంలో ప్రభుత్వం జారీ చేసిన 03-05-2010 తేదీ గల జి.ఓ.ఎంఎస్. నం.125ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అందులో పేర్కొన్న దూదేకుల ఆర్థిక సహకార సంస్థ (దూదేకుల ఫైనాన్షియల్ కార్పొరేషన్)ను కార్యరూపంలోకి తీసుకువచ్చి, సామాజిక వర్గంలోని పేద కుటుంబాలకు స్వయం ఉపాధి, వ్యాపార అభివృద్ధి, విద్య, ఆర్థిక ప్రగతికి అవసరమైన రుణాలు, ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకం అమలులో జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో దూదేకులకు ప్రాతినిధ్యం కల్పించాలి రాబోయే ఎమ్మెల్సీ నామినేషన్లలో గవర్నర్ కోటా కింద భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని దూదేకుల సామాజిక వర్గానికి కేటాయించాలని సదస్సు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో దూదేకుల సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత, వారి సామాజిక, విద్యా, ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తద్వారా సామాజిక వర్గ సమస్యలు ప్రభుత్వానికి చేరడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు. దూదేకుల సామాజిక వర్గానికి విద్య, ఉపాధి, ఆర్థిక సహకారం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో తగిన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, యువత, మహిళలు ఐక్యంగా పనిచేయాలని సదస్సులో పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంఘటితంగా కమిటీని బలోపేతం చేసి, సామాజిక వర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని వక్తలు సూచించారు. దూదేకుల సామాజిక వర్గ ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని చైతన్య కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. సామాజిక ఐక్యత, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధనకు జె.ఏ.సి. కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

