ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా సూచించారు.
రుద్రంపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, సమాచార భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు.
ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించకూడదని వివరించారు. సైబర్ నేరానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బి. కరుణ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఇన్‌చార్జి రవికుమార్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


