పేద విద్యార్థుల చదువుకు ‘బండి’ భరోసా!
పదో తరగతి పరీక్ష ఫీజులను స్వయంగా చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
జిల్లా డీఈవో ఖాతాలో రూ.1.35 లక్షలు జమ.. ఫీజులు వసూలు చేయవద్దని ఉత్తర్వులు
– బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం
నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కారాదనే ఉదాత్త సంకల్పంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులందరి వార్షిక పరీక్ష ఫీజును స్వయంగా తానే చెల్లించి కొండంత అండగా నిలిచారు. ఈ నిర్ణయంతో మొత్తం 10,959 మంది నిరుపేద విద్యార్థుల కుటుంబాలకు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, భీమారం, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన 1,087 మంది విద్యార్థుల పరీక్ష ఫీజుల నిమిత్తం మొత్తం రూ.1,35,875/- లను కేంద్ర మంత్రి నేరుగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఖాతాలో జమ చేశారు. దీంతో ఒక్క మల్యాల మండలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 350 మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక భారం తప్పి నేరుగా లబ్ధి చేకూరింది. కేంద్ర మంత్రి స్వయంగా పరీక్ష ఫీజులు చెల్లించడంతో, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని, ఇప్పటికే సేకరించి ఉంటే వెంటనే ఆ మొత్తాన్ని రీఫండ్ చేయాలని జిల్లా డీఈవో కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం తోడ్పడుతూ భరోసానిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్‌కు బీజేపీ మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం విద్యార్థులు, తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


