హుస్నాబాద్ మిల్లులకే ధాన్యం కేటాయించాలి..! ధాన్యం కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలి
కవ్వ వేణుగోపాల్‌రెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్‌చార్జి
హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లులు, బాయిలర్ మిల్లులకు కేటాయించాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్‌చార్జి కవ వేణుగోపాల్‌రెడ్డి కోరారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మిల్లులు అందుబాటులో ఉన్నప్పటికీ ధాన్యాన్ని సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు ఎందుకు కేటాయిస్తున్నారో జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాలకు ధాన్యం తరలించడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు, సమయం పెరుగుతున్నాయని తెలిపారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, విశ్రాంతి షెడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం పేరుతో తరుగు తీస్తున్నారనే రైతుల ఫిర్యాదులపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైస్ మిల్లులు, బాయిలర్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై ఉన్న విధానాన్ని రైతులకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి అదనపు రవాణా భారం లేకుండా స్థానికంగానే ధాన్యం సేకరణ, కేటాయింపులు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కవ్వ వేణుగోపాల్‌రెడ్డి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

