నర్సాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం ముగ్గురికి తీవ్ర గాయాలు , రెండు బైక్ లను డీ కొట్టిన కారు
మెదక్ : నర్సాపూర్ పట్టణ పరిధిలోని న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణంలోని న్యూ క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన మెదక్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ తాహెర్ (54), తన కుమారుడు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19)తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగు ప్రయాణంలో 11:15 గంటల సమయంలో న్యూ క్లాసిక్ గార్డెన్స్ నుంచి సుమారు 30 మీటర్ల దూరంలో నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న కుమారుడు ఖాజా మొయినుద్దీన్ ఎడమ కాలు, ముఖం మరియు శరీరంపై తీవ్ర రక్త గాయలకు గురయ్యాడు. కాగా వెనుక కూర్చున్న తండ్రి మహమ్మద్ తాహెర్ తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కొద్దిదూరంలో వస్తున్న మరో ద్విచక్ర వాహనం (నంబర్ TS35B9507)ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనంపై ప్రయాణిస్తున్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన చిగురు ప్రదీప్ (27), తలారి నవీన్ (27) తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ధరణి ఆసుపత్రికి, సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు ఈ ఘటనపై మృతుడి భార్య సజీదా జబీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని కారు మరియు దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎసై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


