వర్షాభావంలో వరికి స్వస్తి.

వర్షాభావంలో వరికి స్వస్తి.

  • ఆరుతడి పంటలే మేలు:
  • ఎల్ నినో ప్రభావం: ఆపత్కాల పంటలతోనే భూసారం, లాభాలు
     
  • జూలై, ఆగస్టుల్లో ఏ పంటలు వేయాలో తెలుసా?
     
  • తగ్గిన భూగర్భ జలాలు..
  • ప్రత్యామ్నాయ సాగుపై రైతు విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు
  • కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్

రాజన్న సిరిసిల్ల : వర్షాభావ పరిస్థితులు, తగ్గిపోతున్న భూగర్భ జలాలు మరియు కాలువల్లో సాగునీటి కొరత కారణంగా జిల్లాలో వరి సాగు సవాలుగా మారుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. సాయి కుమార్ తెలిపారు. వర్షపాతం గణనీయంగా తగ్గడం, ఎల్ నినో ప్రభావం ఉన్న ఈ సమయంలో నీటి లభ్యత తక్కువగా ఉండే ఆరుతడి పంటలను ఎంచుకోవడం అత్యంత శ్రేయస్కరమని ఆయన రైతులకు సూచించారు. ఈ సంవత్సరం జూలై నెలలో సాధారణం కంటే దాదాపు 80 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. పంటకాలం బాగా ఆలస్యమవుతున్నందున, ఇప్పటి వరకు సాగు ప్రారంభించని రైతులు ఆపత్కాల పంటల వైపు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రతి ఏడాదీ కాలువలు, బోర్ల కింద రెండు పంటలుగా వరి సాగు చేసే రైతులు కూడా, ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి చేపట్టడం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడు కోవడమే కాకుండా నేల సారాన్ని కూడా పెంచుకోవచ్చని వెల్లడించారు. రైతు సోదరులు మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయదగిన వివిధ పంటలు, విత్తుకునే గడువు మరియు యాజమాన్య పద్ధతుల గురించి ఆయన సమగ్ర సమాచారాన్ని అందించారు. కంది పంటను ఆగస్టు 15వ తేదీ వరకు విత్తుకునే వెసులుబాటు ఉంది. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలపరిమితి గల  పి.ఆర్.జి-176 లేదా మధ్యస్థ కాలపరిమితి కలిగిన డబ్ల్యూ.ఆర్.జి.ఈ-97, డబ్ల్యూ.ఆర్.జి.ఈ-93 వంటి రకాలతో పాటు ఇతర స్వల్ప, మధ్యస్థ కాలపరిమితి రకాలను ఎంచుకోవాలి. విత్తుకునేటప్పుడు తేలికపాటి నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం పాటించాలి. అదేవిధంగా బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. ఎడంగా విత్తుకోవాలి. మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు జూలై 31 నాటికి విత్తడం పూర్తి చేసుకోవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం లాభదాయకం. అదేవిధంగా వేరుశనగ పంటను కూడా జూలై 31 వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ నీరు, స్వల్ప పోషకాలు ఉన్న నేలల్లో సైతం చిరుధాన్యాలు సమర్థవంతంగా దిగుబడి నిస్తాయి. సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాలను ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ మరియు మార్కెటింగ్ సౌకర్యం ఉన్నందున రైతులకు ఆశాజనకమైన ఆదాయం లభిస్తుంది. ఆముదం పంటను ఆగస్టు 15 వరకు సాగు చేసుకోవచ్చు. దీనికోసం టిసిహెచ్-111, ఐసిహెచ్-66, ఐసిహెచ్-5 వంటి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవడం అనుకూలం. విత్తే దూర విషయానికి వస్తే తేలికపాటి నేలల్లో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. దూరం, బరువు నేలల్లో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 45 సెం.మీ. దూరం నిర్వహించాలి. పక్షుల బెడద తక్కువగా ఉండే ప్రాంతాల రైతులు పొద్దుతిరుగుడు పంటను ఆగస్టు 15 వరకు సాగు చేసుకోవచ్చు. నువ్వుల పంటను ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 మధ్యకాలంలో విత్తుకోవాల్సి ఉంటుంది. నువ్వులలో అధిక దిగుబడినిచ్చే శ్వేత, రాజేశ్వరి, జె సి ఎస్-1020 వంటి రకాలు ఎంతో అనువైనవి. నువ్వులు విత్తేటప్పుడు వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. రైతులు కాలానికి అనుగుణంగా సరైన పంటలను ఎంచుకుని ఆపత్కాల సాగు యాజమాన్యాన్ని పాటించాలని శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ