మర్రిగూడలో తెలంగాణ జలసిరి'పై సమావేశం
- ఆగస్టు 15 నాటికి నీటి భద్రత పనులు పూర్తికావాలి
- ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పొలానికి పంటకుంట నిర్మించాలి
- ఫ్లోరిన్ నిర్మూలన, భూగర్భ జలాల పెంపే లక్ష్యం
మర్రిగూడ, నల్గొండ: మర్రిగూడ మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:00 గంటలకు తెలంగాణ జలసిరి - జలసంచాయ్ జన్ భాగీదారి' పనులు,'విబిజి రాంజీ' పథకం నిర్వహణపై సర్పంచులు,ఫీల్డ్ అసిస్టెంట్ లు,అధికారులతో మండల స్థాయి సమీక్షా సమావేశం ను మండల ప్రత్యేక అధికారి భీమనపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి సంరక్షణ పనుల అమలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు మండల ప్రత్యేక అధికారి తెలిపారు. జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన విబిజి రాంజీ చట్టం కింద నీటి భద్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరికి ఊటకుంట అనే నినాదంతో గ్రామాల్లో నీటి సంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ పనులన్నింటినీ రాబోయే ఆగస్టు 15 నాటికి విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
125 పని దినాలు - రూ.300 కూలీ
ఈ పథకం కింద ఉపాధి హామీ అనుసంధానంతో గ్రామీణ ప్రజలకు 125 పని దినాలు కల్పించడంతో పాటు, రోజువారీ కూలీగా రూ. 300 అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల గ్రామీణ ఉపాధి పెరగడమే కాకుండా, గ్రామాల్లో శాశ్వత నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పడతాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే కొత్త నివారణ చర్యలు చేపట్టాలని, మెరుగైన నీటి భద్రతను సాధించడమే 'వికాస్ భారత్' యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
నీటిని సంరక్షించుకుందాం!
ఈ సందర్భంగా విబిజి రాంజీ పథకం పై ఏపీఓ జయరాజు, అధికారులు మాట్లాడుతూ మన ప్రాంతంలోని బట్లపల్లి, వట్టిపల్లి గ్రామాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరిన్ బారిన పడిన ప్రాంతాలుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఫ్లోరిన్ నిర్మూలనకు భూగర్భ జలాల మట్టం పెరగడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.సగటున ఒక కుటుంబం సంవత్సరానికి దాదాపు 4 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకుంటే ప్రభుత్వం నుండి రూ. 6,500 ఆర్థిక సాయం అందుతుంది అని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
18 గ్రామపంచాయతీలో గ్రామసభలు
ఈ పథకం విజయవంతం కావడానికి బుధవారం, జూలై 29న మండలంలోని 18 గ్రామపంచాయతీలో తప్పనిసరిగా అత్యవసర గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీఓ ఆదేశించారు. గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ పనులను గుర్తించి, తీర్మానాలు తయారు చేయాలన్నారు.ఆయా పనులను గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి.వేణుగోపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సి. మునయ్య,ఎంపీఓ రవికుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్, మండల వ్యవసాయ అధికారి సాహస్, సహాయ ఇంజనీర్లు, మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓ జయరాజ్, మిషన్ భగీరథ ఏఈ వెంకటేష్, ఆర్డబ్ల్యుసి ఏఈ ప్రభాకర్,టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు,మహిళా సమైక్య మండల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


