వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
- శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించాలి
- భక్తులు, నిర్వాహకులు అధికారులకు సహకరించాలి
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
మెట్‌పల్లి : వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం మెట్‌పల్లి పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జనం కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను శోభాయాత్రగా తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన స్టేజ్, విద్యుత్ దీపాల ఏర్పాటు, వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బంది, పరికరాలను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

