తెలంగాణ–జపాన్ మధ్య నైపుణ్య, ఉపాధి బంధం బలోపేతం
ఐదేళ్లలో 45 లక్షల మందికి నైపుణ్య శిక్షణ.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ యువతను సిద్ధం చేస్తాం ,హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ : తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల హిరోషిమా పర్యటన సందర్భంగా చర్చించిన అంశాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జపాన్ పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జపనీస్ భాషా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భాషపై పట్టు సాధించడంతో పాటు, జపాన్ పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను యువతకు అందించడమే లక్ష్యమన్నారు. జపాన్ పారిశ్రామిక రంగంలో పాటించే కచ్చితత్వం, క్రమశిక్షణ, పనిపట్ల అంకితభావం వంటి విలువలను తెలంగాణ యువతలో పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు జపాన్ పని సంస్కృతిపై అవగాహన కల్పించడం ద్వారా అక్కడి ఉపాధి అవకాశాలను యువత మరింత సమర్థంగా అందిపుచ్చుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.హిరోషిమా ప్రభుత్వంతో చర్చల ద్వారా నైపుణ్య మానవ వనరుల మార్పిడి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల విస్తరణకు మరిన్ని మార్గాలను అన్వేషిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ యువతకు విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కార్యక్రమంలో పాల్గొనాలని హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో జపాన్‌తో మరింత సన్నిహితంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టామ్‌కామ్ ఎండీ కాంతి వెస్లీతో పాటు సంబంధిత శాఖల అధికారులు, హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


