గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత
నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ : ఆపరేషన్ కవచ్‌లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుకుంటా గ్రామ శివారులో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అశోక్, వైభవ్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, గంజాయి తరలింపునకు ఉపయోగించిన కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆపరేషన్ కవచ్‌లో భాగంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి గంజాయి పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఆర్ఎస్ఐ జావిద్ అలీ ఖాన్, సిబ్బంది రాము, శేషారావులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి, ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచి, విధుల్లో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్స్అప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి సాగుకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి ఒక్కో మొక్కకు రూ.50 చొప్పున నగదు రివార్డు అందజేస్తామని వెల్లడించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


