రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ఘటనలో శిశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఐదుగురు శిశువులు మృతి.. 17 మంది డిశ్చార్జి, హైదరాబాద్‌లో ఐదుగురు శిశువులకు చికిత్స.. ఆరోగ్యం నిలకడగా ఉంది
ఆదిలాబాద్ బ్యూరో ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ) ఘటనలో ప్రభావితమైన 27 మంది శిశువుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆదివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు శిశువులు మృతి చెందగా, 17 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని, మరో ఐదుగురు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
చికిత్స అనంతరం ఇళ్లకు చేరుకున్న 17 మంది శిశువుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిశ్చార్జి అయిన వారిలో ఏడుగురు మహారాష్ట్రకు చెందినవారు కాగా, పది మంది ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కోసం నాందేడ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమాచారం అందించామని, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది శిశువులకు స్థానిక వైద్య సిబ్బంది ద్వారా నిరంతర వైద్య పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్‌లో ప్రత్యేక నవజాత శిశువుల వైద్య సంరక్షణ విభాగాన్ని (ఎంఎన్‌ఐసీయూ), స్టెప్‌డౌన్ యూనిట్‌ను బలోపేతం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం 18 పడకల ఎంఎన్‌ఐసీయూ, 12 పడకల స్టెప్‌డౌన్ యూనిట్ కలిపి మొత్తం 30 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంఎన్‌ఐసీయూలో ఆక్సిజన్ సదుపాయంతో 11 పడకలు, ఆక్సిజన్ సదుపాయం లేని ఏడు పడకలు ఉన్నాయని వివరించారు. స్టెప్‌డౌన్ యూనిట్‌లో ఆక్సిజన్ సదుపాయంతో 12 పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా మరో నాలుగు పడకలను ఏర్పాటు చేయనున్నట్లు, అవి అందుబాటులోకి వస్తే మొత్తం పడకల సంఖ్య 34కు చేరుతుందని తెలిపారు.
ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరమైన నవజాత శిశువులకు సకాలంలో తగిన చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఘటనలో ప్రభావితమైన శిశువుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన వైద్య చికిత్సతో పాటు తదుపరి పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. శిశువుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


