అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్లు ఎంపీడీవో రాజేందర్
మండల వ్యాప్తంగా 458 పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ
గంభీరావుపేట : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేయూత పెన్షన్లు అందిస్తున్నట్లు ఎంపీడీవో అనుముల రాజేందర్ తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండల వ్యాప్తంగా నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మల్లు గారి పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల వివిధ రకాలైన చేయూత పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. మండలంలో వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, గీత, చేనేత కార్మికుల కింద 458 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసినట్లు వివరించారు. అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరిని 360 డిగ్రీ విధానంలో ఎంపిక చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల పెన్షన్ల కింద 539 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరైన పెన్షన్ పత్రాలు అందిస్తుండగా, వివరణ కారణాలతో మరో 39 పెన్షన్లు పెండింగులో ఉన్నాయన్నారు. వాటి పరిశీలన అనంతరం అర్హులకు పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ఆందోళన పడాల్సిన అవసరం లేదని. అలాంటివి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించి వారి జీవనానికి అండగా నిలవడమే సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరు చేసి పత్రాలు అందించడం పట్ల పలు గ్రామాల సర్పంచ్ లు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ మారుతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, ఫ్యాక్స్ చైర్మన్ వేశాల వెంకటి, వైస్ చైర్మన్ మేడ భాస్కర్, పీఏసీ వై చైర్మన్ బలరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్, రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, ఎంపీ ఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సల్లావుద్దీన్ లతోపాటు వివిధ గ్రామాల సర్పంచ్ లు నాగపురి బాలరాజు గౌడ్, మల్లు గారి పద్మ, ఉమా రెడ్డి విమల, బండ సుకన్య, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, చేకోటి మహేష్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, శివంది దేవేందర్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


